సౌత్​స్టేట్స్​కు ముప్పు!

భారతదేశంలోని 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు  కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి.  రాష్ట్రాలకు  స్వయం ప్రతిపత్తి,  ప్రత్యేక ప్రభుత్వాలు ఉన్నా.. కొన్ని అంశాలపై ఆది నుంచి కేంద్రానిదే  గుత్తాధిపత్యం. అన్ని రాష్ట్రాలను  సమదృష్టితో  చూడాల్సిన  బాధ్యత  కేంద్ర ప్రభుత్వానిదే.  

దక్షిణాది రాష్ట్రాలు చాలా విషయాల్లో  కేంద్రాన్ని సుసంపన్నం చేస్తున్నప్పటికీ ఆ రాష్ట్రాలపై  సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కేంద్రం ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో సరైన శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం లేదా?  సంపదను సృష్టిస్తున్న  దక్షిణాది రాష్ట్రాలే  భవిష్యత్తులో  బలికానున్నాయా?  

నేడు దక్షిణ భారతదేశం దేశ జనాభాలో 20% కలిగి ఉంది. దేశ జీడీపీలో 31% వాటాను  అందిస్తోంది. ఇది 2030 నాటికి 35శాతానికి పెరుగుతోందని అంచనా.  దక్షిణ  భారతదేశ  జీడీపీ రూ. 83.57 లక్షల కోట్లు కాగా, ఉత్తర భారతదేశ జీడీపీ రూ.46.00 లక్షల కోట్ల వరకు ఉంది.  భారతదేశ జీడీపీలో  దక్షిణ భారతదేశం వాటా1960–61లో  25.2% నుంచి 2023–24లో 30.6%కి పెరిగింది.

జీడీపీకి అత్యధికంగా దోహదపడే  ఐదు  దక్షిణాది రాష్ట్రాల్లో  తమిళనాడు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది.  తమిళనాడు రూ.24.8 లక్షల కోట్ల జీడీపీ ని,  కర్నాటక రూ.22.4 లక్షల కోట్లు,  తెలంగాణ రూ.13.3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.13.2 లక్షల  కోట్లు, కేరళ రూ.10 లక్షల కోట్ల జీడీపీని కలిగి ఉన్నాయి. 1991 ఆర్థిక సరళీకరణ తర్వాత అన్ని దక్షిణాది రాష్ట్రాల తలసరి ఆదాయం పెరిగింది.  దీనికి విరుద్ధంగా 2000 సంవత్సరం తర్వాత  ఉత్తర భారతం  వృద్ధి చాలా మందగించింది. 

తెలంగాణ 

గత ఐదేండ్లలో సగటు వార్షిక వృద్ధి రేటు 13.9% తో  భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి  చెందుతున్న  రాష్ట్రాల్లో  తెలంగాణ ఒకటిగా ఉంది.  దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది.  

తమిళనాడు 

తమిళనాడు రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో   భారతదేశంలో  రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.  స్థూల రాష్ట్ర  దేశీయ ఉత్పత్తి  మహారాష్ట్ర  తర్వాత తమిళనాడు రెండో  అతిపెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.  తలసరి జీడీపీలో   రాష్ట్రాలలో  నాలుగో స్థానంలో ఉంది. 

కర్నాటక 

కర్నాటక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.22.4 లక్షల కోట్లు.  తలసరి జీడీపీలో  కర్నాటక మూడో పెద్ద రాష్ట్రం.  2021– -22లో  కర్నాటక  జీఎస్​డీపీ  9.5% పెరిగింది.  2021-–22లో  భారతదేశ జీడీపీలో  కర్నాటక వాటా 8.8%. 

కేరళ 

2023–-24 ఆర్థిక సంవత్సరానికి కేరళ రాష్ట్ర  స్థూల దేశీయోత్పత్తి (జీఎస్​డీపీ) రూ.11.6 లక్షల కోట్లు గా  అంచనా వేయడమైనది. 2022-–23 ఆర్థిక సంవత్సరానికి కేరళ జీఎస్​డిపీ వృద్ధి రేటు 6.6%, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ.

ఆంధ్రప్రదేశ్  

2023–2024  ఆర్థిక  సంవత్సరానికి  ఆంధ్రప్రదేశ్  జీడీపీ రూ.15.40 లక్షల కోట్ల అంచనా.  గత  ఏడాదితో  పోలిస్తే  ఇది 17% వృద్ధిని అంచనా వేసింది. జీడీపీలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది.   

ఆదాయాల  కేటాయింపుల్లో అసమానత 

 కేంద్ర పన్ను  ఆదాయాలను  రాష్ట్రాలకు  కేటాయించేందుకు ఆర్థికసంఘం అనేక ప్రమాణాలను పాటిస్తోంది.  జనాభా  పరిమాణం  కీలకమైన అంశం.   బిహార్​కి  ప్రత్యేకించి  67.4%,  మధ్యప్రదేశ్ 48.1%,  ఉత్తరప్రదేశ్ 42.3%  కూడా  దక్షిణాది రాష్ట్రాల కంటే చాలా ఎక్కువస్థాయిలో కేంద్ర నిధులపై ఆధారపడి ఉన్నాయి. పన్నులు, ఇతర పద్ధతుల్లో సేకరించిన నిధులు కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రతి రాష్ట్రం నుంచి ఒక రూపాయి వసూలు చేస్తే..  దక్షిణాది  రాష్ట్రాలైన  కర్నాటకకు 15 పైసలు,  తమిళనాడుకు 28 పైసలు,  ఏపీకి 42 పైసలు,  తెలంగాణకు 47 పైసలు,  కేరళకు 62 పైసలు రిటర్న్ వస్తున్నాయి.  కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 1.20,  ఒడిశాకు రూ.1.25 ,  మధ్యప్రదేశ్‌‌‌‌కు రూ.2.09,  యూపీకి రూ. 2.49 ,   బిహార్​కి  ప్రతి రూపాయికి  ఏకంగా 7 రూపాయల 26 పైసలు కేటాయిస్తుంది కేంద్రం.  

 సౌత్ భవిష్యత్తుకు ముప్పు?

పడిపోతున్న సంతానోత్పత్తి రేటు,  వృద్ధాప్య  జనాభా కారణంగా దక్షిణ భారతదేశం బహుముఖ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.  ఆర్థికంగా,  తగ్గిపోతున్న  శ్రామికశక్తి,  కార్మికుల కొరత తగ్గిన ఉత్పాదకతకు దారితీయవచ్చు.  2026 డీలిమిటేషన్  సమయంలో అధిక జనాభా  పెరుగుదల ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు సీట్లు పొందుతాయి.  దక్షిణాది  రాష్ట్రాలు పార్లమెంటరీ  ప్రభావాన్ని కోల్పోయే  ప్రమాదం ఉంది.  

2026  డీలిమిటేషన్ లో   ఐదు దక్షిణాది రాష్ట్రాలు దాదాపుగా 26  పార్లమెంటరీ  స్థానాలను  కోల్పోయి దాదాపు 108 సీట్లు లేదా అంతకంటే తక్కువకు పడిపోతే,  రాజ్యాంగ  సవరణలను  ప్రభావితం చేసే వారి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది. దక్షిణాది ఎంపీలందరూ ఒక కూటమిగా ఓటు వేసినప్పటికీ,  వారు మొత్తం సీట్లలో దాదాపు 20% మాత్రమే కలిగి ఉంటారు.  మూడింట రెండు వంతుల మెజారిటీని నిరోధించడానికి అవసరమైన 33% కంటే చాలా తక్కువ. 

దక్షిణాది నేతల నిరసన గళం

కేంద్రం వివక్ష చూపడాన్ని నిరసిస్తూ  దక్షిణాది రాష్ట్రాల  ప్రజాప్రతినిధులు ఢిల్లీలో  నిరసనలు చేపట్టారు. కర్నాటక సీఎం నేతృత్వంలోని ఈ నిరసన దీర్ఘకాలిక విభేదాలను తెరపైకి తెచ్చింది. తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. పిల్లలను బాగా కనండి మంచి భవిష్యత్తు ఉంటుందంటే.  ఏపీ సీఎం చంద్రబాబు సైతం పిల్లలను కనకపోవడమే మనం చేస్తున్న పెద్ద పొరపాటుగా పేర్కొన్నారు.

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి   సౌత్ స్టేట్స్ సంపదను సృష్టిస్తుంటే ఆ సొమ్మును కేంద్రం నార్త్ స్టేట్స్ కు పంచుతూ అన్యాయం చేస్తున్నదని, జీడీపీలో 30 శాతం వాటా ఉన్న  దక్షిణాది రాష్ట్రాలకు 16 శాతం జనాభా లెక్కన నిధులు ఇస్తున్నారని, కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఉద్యమించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని, అవసరమైతే ఆ పోరాటానికి తాను నాయకత్వం వహిస్తానని పిలుపునిచ్చారు. అయితే, కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్  రాష్ట్రాలకు విభజన ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారమే జరుగుతుందని,  పన్నుల రాబడి కేటాయింపులో తనకు విచక్షణ  లేదని ప్రతిపక్షాలు విమర్శలకు సమాధానం ఇవ్వడం శోచనీయం.

సౌత్​ను  దెబ్బతీస్తున్న  ‘జనాభా’

భారతదేశ ఆర్థిక  ద్రవ్యరాశి  ఎక్కువగా  దక్షిణ భారతదేశంలో  కేంద్రీకృతమై ఉంది.  భారతదేశాన్ని  ప్రపంచంలోనే  అత్యంత  వేగంగా అభివృద్ధి  చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చింది.  భారతదేశ జనాభా వేగంగా పెరుగుతోంది.  ఏప్రిల్ 19, 2023న  ఐక్యరాజ్యసమితి భారతదేశం (142.86 కోట్లు) పొరుగున ఉన్న చైనాను (142.57 కోట్లు) అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా  ప్రకటించింది.  దక్షిణాది  రాష్ట్రాలతో పోలిస్తే  జనాభా అభివృద్ధిలో  1971,  2011 జనాభా లెక్కల మధ్య ఉత్తరాది రాష్ట్రాల వృద్ధి 150% పైగా పెరగగా,  దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ,  కర్నాటకలు 100% కంటే  తక్కువగా వృద్ధిని నమోదు చేశాయి.  కారణం ఉత్తరాది  రాష్ట్రాలు  దక్షిణాది రాష్ట్రాల కంటే  ఎక్కువ సంతానోత్పత్తి  రేటు 2.1లను కలిగి ఉండటమే.

- డాక్టర్. బి.కేశవులు, చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం-